ఎస్పీ చరణ్ వ్యాఖ్యత గా ఈటీవీ లో పాడుతా తీయగా

Sp charan will Host padutaa teeyagaa




ఎస్పీ.బాలు లేకుండా చరణ్‌ సారథ్యంలో...

తెలుగుసినీ సంగీత వాకిలి, మధురగీతాల జావళి. యువ గాయకుల లొగిలి ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం.  25 ఏళ్లక్రితం బాలు గారి చేతుల మీదుగా ప్రారంభమైందీ ఈ సంగీత యజ్ఞం. 18 సీజన్లు అప్రతిహతంగా సాగిన ఈ స్వరధుని వేల ప్రతిభావంతులను సమాజానికి పరిచయం చేసింది. త్వరలో ప్రారంభంకానున్న 19వ సీజన్ పాడుతా తీయగా కోసం ఈటీవీ భారీ కసరత్తు చేసింది. కరోనా దృష్ట్యా ఆన్‌లైన్‌ ఆడిషన్స్ నిర్వహించింది. 4 వేలమంది గాయనీగాయకుల స్వరాలను నిర్ణేతల పరీక్షించి వారిలో నుంచి 16 మంది కళాకారులను ఎంపిక చేశారు. #spcharan #spbalu #padutaateeyagaa #etv 


కొద్దిరోజుల్లో కనుల, వీనులపండుగా ఈటీవీ బుల్లితెరపై ప్రసారం కానున్న ఈ రియాలిటీ షోను నిర్వహించే బాధ్యతను బాలు కుమారుడు ఎస్‌పీ చరణ్ స్వీకరించటం విశేషం. దీనికి సింబాలిక్‌గా బాలు తొలి వర్థంతి రోజున రామోజీరావు చేతుల మీదుగా చరణ్‌ మైక్‌పీస్ అందుకున్నారు. మేటి గాయకులను ఎంపిక చేసేందుకు సినీసంగీత సామ్రాజ్యంలో సెలబ్రిటీలుగా ఎదిగిన చంద్రబోస్, సునీత, విజయ్‌ప్రకాష్‌లు పాడుతా తీయగా జడ్జిలుగా వ్యవహరించబోతున్నారు. ఈ షోలో చక్కటి స్వరంతో అద్భుతంగా పాడిన యువతీ యువకులపై సినీపరిశ్రమ నజర్ ఎప్పుడూ ఉంటుంది. మనందరికీ తెలిసిన ప్రఖ్యాత గాయనీ గాయకులు ఉష, హేమచంద్ర, కారుణ్య, రామాచారి, మాళవిక, కౌసల్య, స్మిత, కె.ఎం.రాధాకృష్ణ, గోపికా పూర్ణిమా, సాహితి, దామిని, మల్లిఖార్జున్ వంటి ఎందరో ఈటీవీ పాడుతా తీయగా పరిచయం చేసిన వారే. సంగీతాన్ని ఆరాధించే వారికి, పాటలను ప్రేమించే వారికి పాడుతా తీయగా కార్యక్రమం ఓ సంగీత ఆరాధనోత్సవం. సంగీత, సాహిత్య సమలంకృతంగా, తెలుగు సినీ సంగీత సంగతుల ఆవిష్కరణగా ఈ ప్రోగ్రామ్‌ను వారు భావిస్తారు. 


అందుకే ఈటీవీ ప్రారంభించినప్పటి నుంచి పాతికేళ్ల నుంచి ఈ కార‌్యక్రమం ప్రసారం అవుతూనే ఉంది. యువ గొంతుకలు అలనాటి పాటలను స్వరాలతో మీటుతూంటే యాంకర్‌గా ఎస్పీ బాలు సమయోచితంగా, సందర్భోచితంగా పాట వెనుక మాటలను గుర్తు చేస్తూండేవారు. మంత్రపుష్పాలలా జ్ఞాపకాల చర్చ చందన చర్చితమౌతుంటే అందరూ మంత్ర ముగ్ధులై ఆస్వాదిస్తుంటారు. సినీ ప్రేమికులు అంతా ఆ పాటల జ్ఞాపకాల చలమలోకి, ఆ అనుభవాల కాసారంలోకి తొంగి చూసుకుని తమను తాము ‘గుర్తించు’కుంటారు. కలకాలం గుర్తుంచుకుంటారు. అవన్నీ అక్కడ పాడే గాయకులకు ప్రేరణలు, ప్రశంసాతోరణాలు, హృద్యమైన అభిభాషణలు. ప్రతిభ ఉండీ, రాగాలు నేర్చుకునే శక్తిలేక జీవనరాగంతో రాజీపడిన అనేక నవయువ స్వరాలను బాలు తట్టిలేపారు. టాలెంట్‌ను ఎంతో ప్రోత్సహించే బాలు వేల బాల, యువ స్వరాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని ఆయన కుమారుడు చరణ్ ఎలా కొనసాగిస్తారో అని సంగీత అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఆల్‌ ది బెస్ట్ చరణ్‌.

Comments

Popular posts from this blog

సాయంత్రం 7తో బంద్! ఏపీ లో కోవిద్ మార్గదర్శకాలు

IAS transfers in ap ఏపీ లో ఐఏఎస్ ల బదిలీలు

Jagan cabinate expansion likely in november! 7 ministers continue